కేసీఆర్ రాజీ లేని పోరాటంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి పదిహేనేళ్లు పూర్తయిన సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని అలుగునూర్‌లో నిర్వహించిన దీక్షా దీవస్ సభలో కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణకు పునఃర్జన్మ ఇచ్చింది కరీంనగర్. కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్ర సమితికి జన్మస్థలం కరీంనగర్. ఆనాడు 370 మంది అమరుల సాక్షిగా మొదటిసారిగా 11 సీట్లు బీఆర్‌ఎస్‌కు వచ్చాయి. 1956 నుంచి 1968 వరకు తెలంగాణకు అన్యాయం జరిగింది. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలైంది. తొలిదశ ఉద్యమంలో 370 మంది బలిదానమిచ్చారు. 1971 నుంచి 30 ఏళ్ల పాటు మేధావులు ఉద్యమకారులు ఎదురు చూశారు. అప్పుడే కేసీఆర్ వచ్చి కరీంనగర్ సింహగర్జనతో ఉద్యమబాట పట్టారు. పదవులు త్యాగం చేసి 2001లో టీఆర్‌ఎస్‌ను స్థాపించి రాజీలేని పోరాటం చేశారు. కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించారు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ సాధ్యమైంది అని కేటీఆర్ అన్నారు.