తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సెటైర్లు గుప్పించారు. పైసా పని లేకున్నా, రాష్ట్రానికి రూపాయి లాభం లేకున్నా, ఢిల్లీకి వెళ్లడం మాత్రం తప్పదంటూ విమర్శించారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో 25 సార్లు 50 రోజుల పాటు ఢిల్లీ పర్యలను చేశారంటూ ఎద్దేవా చేశారు. పోను 25 సార్లు, రాను 25 సార్లు, నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేశావంటూ కామెంట్ చేశారు. తట్టా మట్టి తీసింది లేదు కొత్తగా చేసింది అసలే లేదని అయినను పోయి రావాలె హస్తినకు అంటూ విమర్శలు చేశారు.అన్నదాతల అరిగోసలు పడుతున్నా, గురుకులాలు గాల్లో దీపాల్లా మారినా, వైద్యం కుంటుపడుతున్నా, విద్యా వ్యవస్థ గాడి తప్పినా ఢిల్లీకి పోవాల్సిందే అంటూ సీఎం రేవంత్‌ను ఉద్దేశిస్తూ రాసుకొచ్చారు. మూసి పేరుతో, హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టి 420 హామీలను మడతపెట్టి మూలకు వేశారని విమర్శించారు. పండగలు పండగళ్లా లేవని, ఆడబిడ్డల చీరలు అందనేలేదని, అవ్వాతాతలు అనుకున్న పింఛను లేదని, తులం బంగారం జాడ లేదని, స్కూటీలు, కుట్టు మిషిన్లు లేకున్నా ఢిల్లీకి పోయి రావాల్సిందే అంటూ రాసుకొచ్చారు.