బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిశారు. తెలంగాణలో అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కేటీఆర్ కేంద్రమంత్రికి దీనిపై ఫిర్యాదు చేశారు. పలువురు కాంగ్రెస్ నేతల కుటుంబసభ్యులకు అమృత్ టెండర్లు ఇచ్చారని , దీనిలో కోట్లల్లో అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. విచారణ జరిపి అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ పర్యటనపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఇప్పుడే ఢిల్లీలో అడుగు పెట్టా.. హైదరాబాద్‌లో అప్పుడే వణికిపోతే ఎలా?.. హైదరాబాద్‌లో ప్రకంపనలు కనిపిస్తున్నాయి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు.. కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయింలో విమర్శలు చేస్తున్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే బీజేపీ పెద్దలను కలుస్తున్నారని ఆరోపించారు.