రైతులు ఆశ పడతారు తప్ప అడుక్కోరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లాలో మంత్రి తుమ్మల రైతులపై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనలో రైతులకు అందించిన సేవలను గుర్తు చేశారు. రైతే రాజు అనేది నినాదం కాదని, కేసీఆర్ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. అడగకుండానే రైతులకు రైతుబంధు, రైతుబీమా, సాగు నీళ్లు, ఉచితంగా 24 గంటల కరెంటు, వంద శాతం పంటల కొనుగోళ్లు చేశామన్నారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనతో వ్యవసాయ రంగం వెన్నువిరిగి బతుకుదెరువు కోసం వలసబాట పట్టిన అన్నదాతలలో ఆత్మవిశ్వాసం నింపామన్నారు. వ్యవసాయం దండగ కాదు పండగ అని చాటిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. కరోనా సమయంలోనూ రైతులకు బాసటగా నిలిచామన్నారు.
కాంగ్రెస్ రైతు బంధును రాజకీయం చేసి, రైతు భరోసా అంటూ భ్రమలు కల్పిందన్నారు. రైతు బీమాను మాయం చేసి, 24 గంటల ఉచిత విద్యుత్తును ప్రశ్నార్థకం చేశారని మండిపడ్డారు. పంటల కొనుగోళ్లకు పాతరవేసి
సాగునీళ్లను సాగనంపి, అన్నదాతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, రైతును రహదారుల పైకి లాగిన మీరా.. రైతుల గురించి మాట్లాడేది అని నిలదీశారు. రైతుభరోసాకు ఎగనామం పెట్టి, రుణమాఫీ పేరుతో కనికట్టు చేశారని, ఇల్లిల్లూ తిరిగి అబద్దపు హామీలు ఇచ్చి నాడు ఓట్లు అడుక్కున్న చరిత్ర కాంగ్రెస్ నేతలదని విమర్శించారు. సమయం వచ్చినప్పుడు రైతులు గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు.