రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాల్సిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. రైతులు కన్నీళ్లు పెడుతున్నా ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. గుట్టలను మట్టి చేసి భూదాహం తీర్చుకోవడం కాదు రేవంత్.. గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడు అంటూ ఘాటుగా స్పందించారు. గాలి మోటార్లో మూటలు మోసుడు కాదు.. కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడు అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడు అంటూ మండిపడ్డారు. కల్లబొల్లిమాటలతో కాలయాపన చేయడం కాదని, ధాన్యం కొనడానికి ముందుకు రాని మిల్లర్ల ముచ్చటేందో చూడాలని సూచించారు. మూసీ ముసుగులు కాదు.. కల్లంలో కాంటా ఎప్పుడు వేస్తారో తెలియక కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ల వైపు చూడాలన్నారు. పొద్దు, మాపు ఢిల్లీ యాత్రలు చేయడం కాదని, పల్లె పల్లెల్లో, వాడ వాడల్లో వడ్లు కొనండి మొర్రో అంటూ మొత్తుకుంటున్న రైతు ఆవేదన వైపు చూడాలని సూచించారు. కాసుల కక్కుర్తి, కేసుల కుట్రలు పక్కన పెట్టి పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కక కకావికలం అవుతున్న రైతు బతుకు వైపు చూడాలని కోరారు. దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొట్టారని, సన్న వడ్లకు సున్నం పెట్టారని, ఎగ్గొట్టడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు ఆసరాగా నిలవడం మీద లేదని పేర్కొన్నారు.