గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో తమ ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ దుర్ఘటన జిల్లాలోని పెదకాకాని రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పెదకాకానికి చెందిన మహేశ్(22), నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలజ(21) కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఇటీవలే తమ ఇండ్లల్లో ప్రేమ విషయం చెప్పారు. మహేశ్ తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. శైలజ తల్లిదండ్రులు దీనికి ఒప్పుకోలేదు. దీంతో కొద్ది రోజులుగా వీరిద్దరూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల దసరా పండుగ సమయంలో శైలజ, మహేశ్ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. యువతి కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్‌పై ప్రేమికులిద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే వీరు ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నారనేదానిపై క్లారిటీ రాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.