మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో బీజేపీ కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి 216కు పైగా పైగా సీట్లలో లీడ్‌లో ఉంది. మరో నాలుగు స్థానాల్లో గెలుపు ఖరారైంది. ఇక ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 52 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో కొనసాగుతోంది.మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీయే సీఎం పీఠాన్ని దక్కించుకుంటుందని వెల్లడించారు. బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని, దాదాపు 125 సీట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని కమలం పార్టీ నేత ప్రవీణ్ దారేకర్ ప్రకటించారు. దీంతో పార్టీ నేతలు సంబరాలకు సిద్ధమయ్యారు.