బుద్ధ భవన్‌లో అధికారులు హైడ్రా ప్రజా భవన్ నిర్వహించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో 408 ఎకరాల భూ కబ్జాకు సంబంధించి రాజ్‌గోపాల్ నగర్ ఫ్లాట్స్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. 1983 నుంచి తమకు సేల్ డీడ్స్ ఉన్నాయని, అయితే ఓ జాయింట్ కలెక్టర్ ఇది ప్రభుత్వ భూమి అని పేర్కొన్నట్లు చెప్పారు. దీనిపై కోర్టుకు వెళ్లగా తీర్పు తమకు అనుకూలంగానే వచ్చిందన్నారు. స్థానికంగా స్టేటస్ కో మెయింటైన్ చేయాలని, నేచర్ ఆఫ్ ది ల్యాండ్ మార్చొద్దని కోర్టు ఆదేశించిందన్నారు. ఇక కోర్టు తుది తీర్పు కోసం ఎదురు చూస్తుండగానే పలువురు కబ్జాదారులు అక్కడ ఆరు నుంచి ఏడు వందల ఇండ్లు కట్టి నోటరీ కింద అమ్మేస్తున్నారని చెప్పారు. దీనికి నల్లా కనెక్షన్లు, కరెంటు అనుమతులు కూడా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు అనంతరం తమ భూమి కోసం వెళ్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 3800 ఫ్లాట్ ఓనర్స్ ఉండగా వంద మంది ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు చెప్పారు. దీంతో పాటు పలు ఆక్రమణలకు సంబంధించి ప్రజలు అధికారులు ఫిర్యాదు చేశారు. నాలుగు వారాల్లో ఆయా ఫిర్యాదులు పరిష్కరించాలని రంగనాథ్ ఆదేశించారు. అనంతరం మంగళవారం హైడ్రా అధికారులు సంబంధిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్రమ నిర్మాణాలను పరిశీలించి తగు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నగరంలో 400 ఎకరాల భూ కబ్జాపై హైడ్రాకు ఫిర్యాదు
