ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.43,402 కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుంచారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిదన్నారు. రైతుల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. వ్యవసాయ శాఖకు రూ.8,564.37 కోట్లు, భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు, రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు, విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు, ఎరువుల సరఫరా కోసం రూ.40 కోట్లు, పొలం పిలుస్తోంది కార్యక్రమానికి రూ.11.31 కోట్లు, పంటల బీమాకు రూ.1,023 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి రూ.422.96 కోట్లు, డిజిటల్ వ్యవసాయానికి రూ.44.77 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.187.68 కోట్లు, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రూ.44.03 కోట్లు, వడ్డీ లేని రుణాలకు రూ.628 కోట్లు, అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి రూ.4,500 కోట్లు, రైతు సేవా కేంద్రాల కోసం రూ.26.92 కోట్లు కేటాయించారు.