తెలుగు సినిమాలకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. వైజాగ్‌లో సీఐఐ ఆధ్వర్యంలో నేడు టూరిజం అండ్ ట్రావెల్ సమ్మిట్ నిర్వహించారు. ఈ సమ్మిట్ కు మంత్రి కందుల దుర్గేశ్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు రెండు మూడు రోజులు స్టే చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు సినిమా షూటింగ్ సింహభాగం ఏపీలోనే జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ విజయవాడకు షిఫ్ట్ అయితే బాగుంటుందని చెప్పారు. సినిమాల టికెట్ల రేట్లు పెంచాలని చిత్ర పరిశ్రమ వాళ్లు ప్రభుత్వాన్ని అడుగుతున్నారని, తెలుగు సినిమాలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సముద్ర తీరాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీలోని పర్యాటక ప్రాంతాలపై ప్రచారం చేయాలని, సినిమాల్లో షూటింగ్ జరిగిన ప్రదేశాల అసలైన పేర్లను ప్రకటించాలని కోరారు.