ఏపీలో గత వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ అక్రమాలపై సీఐడీ విచారణ జరిపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నేడు అసెంబ్లీ సమావేశాల్లో పలువురు ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత వైసీపీ పాలనలో కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలోకి వచ్చాక పారదర్శకంగా మద్యం దుకాణాలు కేటాయించినట్లు చెప్పారు. ప్రభుత్వానికి రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చిందని, గత ప్రభుత్వంలో రూ.1,800 కోట్ల అవినీతి జరిగిందని వెల్లడించారు. గత ప్రభుత్వ మద్యం కుంభకోణాలపై సీఐడీ విచారణ జరిపి అక్రమాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.