గత వైసీపీ ప్రభుత్వంపై, వైసీపీ నేతలపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించబోమని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో నేడు జరిగిన ప్రశ్నోత్తరాల్లో ప్రభుత్వం నుంచి సరైన సమాధానాలు రావడం లేదని బొత్స ఆరోపించారు. 2019 నుంచి జరిగిన స్కాంలపై మాట్లాడాలని కూటమి నేతలంటే, తాము 2014 నుంచి జరిగిన స్కాముల గురించి మాట్లాడాలని అడిగినట్లు బొత్స పేర్కొన్నారు. అమరావతి భూములు, స్కిల్ స్కాంలు, అగ్రిగోల్డ్ దందాలు అన్నీ విచారణ చేయాలని బొత్స డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైయస్ జగన్‌పై భూదోపిడీ ఆరోపణలు సరికాదని, విశాఖ సిట్ విచారణపై రిపోర్టులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి దశ , దిశ లేదని బొత్స అన్నారు. అర్థం లేని ఆరోపణలు చేస్తే సమాధానాలు చెప్పబోమని, ఆధారాలు ఉంటే చూపించాలని పేర్కొన్నారు.