తెలంగాణలో కస్తూర్బా విద్యాలయాల్లో నెలకొన్న పరిస్థితులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు కష్టాల కడలిలో ఉన్నాయనంటూ ఆమె ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. జగిత్యాల జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులు దుప్పట్లు లేక చలికి వణికిపోతూ నేలపైనే నిద్రించడం, చన్నీటి స్నానం చేయడం, ప్రభుత్వ చేతగానితనానికి, అసమర్ధతకు నిదర్శనం అంటూ మండిపడ్డారు. కేవలం జగిత్యాల జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఇదే రకమైన పరిస్థితులున్నాయని పేర్కొన్నారు. ఆడబిడ్డలు చదువుతున్న పాఠశాల్లో అన్ని వసతులు కల్పించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.