Site icon

రైతుల‌కు రేవంత్ స‌ర్కార్ న‌మ్మ‌క ద్రోహం

రైతుల‌కు రేవంత్ రెడ్డి స‌ర్కార్ న‌మ్మ‌క ద్రోహం చేసిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నిక‌ల‌కు ముందు ఒక మాట మాట్లాడార‌ని, ఎన్నికల్లో గెలిచాక మరో మాట మాట్లాడుతున్నార‌ని, ఇది రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణికి నిద‌ర్శ‌న‌మ‌ని ఎద్దేవా చేశారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, దుర్కి, నస్రుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంద‌ని క‌విత ఆరోపించారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ఖండిస్తూ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. రుణాలు మాఫీ చేసి అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, డబ్బులు కట్టాలంటూ అంకోల్ తండాలో రైతులపై ఒత్తిడి తీసుకురావడం, బలవంతంగా భూముల వేలానికి ప్రయత్నించడం నియంతృత్వ పాలనను తలపిస్తోంద‌న్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, అంకోల్ తండా ప్రజలను ఆదుకుంటానని నమ్మించి.. ఇప్పుడు రైతులను అప్పు చెల్లించాలంటూ వేధించడం, రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న నమ్మక ద్రోహానికి నిదర్శన‌మ‌ని విమ‌ర్శించారు.

Share
Exit mobile version