వైసీపీ నేత, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఎన్నికల అనంతరం మాట ఇచ్చిన విధంగా తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్న పద్మనాభం మరో సారి సంచలన లేఖతో వార్తల్లో నిలిచారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీకు తగునా? అని ప్రశ్నించారు. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి అని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోకపోవడం అన్యాయం అన్నారు. అలాగే రెడ్‌బుక్‌ను ఉద్దేశిస్తూ లేఖలో పలు ఆరోపణలు చేశారు. సూపర్ సిక్స్ హామీల అమలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చడానికే పని చేస్తోందని విమర్శించారు. సోషల్ మీడియా పేరుతో అమాయకులను జైల్లో పెట్టి హింసిస్తున్నారని ఆరోపించారు.