– 2020లో జరిగిన హత్య కేసులో..
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ కేసులో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ, పూచీకత్తు కట్టని కారణంగా ఆయన గుంటూరు సబ్‌జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు నందిగం సురేష్‌కు మరో షాకిచ్చారు. 2020లో జరిగిన తూళ్లురు మండలంలోని వెలగపూడిలో మరియమ్మ అనే ఓ వృద్ధురాలి హత్య కేసుకు సంబంధించి నందిగం సురేష్‌ను అరెస్ట్ చేసి ఈరోజు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. దీని పై ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం నందిగం సురేష్‌కు 14 రోజుల పాటు అనగా ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. వైసీపీ హయాంలో 2020లో మరియమ్మ హత్యకు గురవగా అప్పట్లోనే పోలీస్ కేసు నమోదైంది. ఆ సమయంలో ఎంపీగా ఉన్న నందిగం సురేష్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్నేళ్లకు మళ్లీ ఆ కేసు ముందుకు రావడం చర్చనీయాంశమైంది.