ఇటీవల సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో ఓ వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఆధ్వర్యంలో ఆలయం వద్ద దీక్ష కూడా చేపట్టారు. ఈ క్రమంలో మాజీ మంత్రి , బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు ముత్యాలమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మీడియాతో మాట్లాడారు. త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తలసాని ఆలయ నిర్వాహకులు, అర్చకులు, బస్తీ ప్రజలతో మాట్లాడారు. ఎలాంటి రాజకీయ ప్రమేయాలు లేకుండా ఆలయంలో బస్తీ వాసుల సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి విగ్రహ ప్రతిష్టాపన చేపడతామని చెప్పారు.