ఏపీలో మద్యం దుకాణాలకు టెండర్లు ముగిశాయి. నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు ఓపెన్ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలు ఉన్నాయి. గత ఐదేళ్ల పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ప్రస్తుతం నిర్వహించిన టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.1800 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో అత్యధికంగా తిరుపతిలో 227 ఉండగా, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40 ఉన్నాయి. వ్యాపారులు డిపోల నుంచి సరుకు తీసుకున్న వెంటనే షాపులు ఓపెన్ చేస్తారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మద్యం షాపులు తెరుచుకొని ఉంటాయి. టెండర్లలో సిండికేట్‌తో సంబంధం లేకుండా సొంతంగా షాపులు దక్కించుకున్న వారు దుకాణాలను ఇతరులకు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా దుకాణాలు చేతులుమారే అవకాశం ఉంది. మరో వైపు స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు, ప్రార్థనా మందిరాలకు వంద మీటర్ల దూరంలోనే మద్యం దుకాణాలు ఉండాలన్న ప్రభుత్వ నిబంధనలతో షాపుల ఏర్పాటుకు కొంత మందికి స్థలం దొరక్క ఇబ్బంది పడుతున్నారు.