తెలంగాణలో ఫాంహౌస్ లో పార్టీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. కేటీఆర్ బావమరిది ఇంట్లో జరిగిన పార్టీపై పలు ఆరోపణలు వస్తున్నాయి. డ్రగ్స్ వినియోగించారంటూ పలు యూట్యూబ్ చానళ్లు వార్తా కథనాలు ప్రసారం చేశాయి. బీఆర్ఎస్ నాయకులను అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి అది కేవలం కుటుంబ పార్టీ అని, అందులో మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు కూడా ఉన్నారని వివరన ఇచ్చారు. గంటల పాటు పోలీసులు సదరు ఫాం హౌస్‌లో సోదాలు జరిపారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీఎన్‌ఎస్‌ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు మోకిల పోలీసులు తెలిపారు.ఈ పార్టీ కేసుకు సంబంధించి రాజ్ పాకాలను విచారించనున్నారు. అడ్రస్ ఫ్రూఫ్, కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని సూచించారు.రాజ్ పాకాల విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో రాజ్ పాకాల పోలీసులకు అందుబాటులోకి లేకపోవడంతో మోకిల ఇన్‌స్పెక్టర్ పేరుతో ఉన్న నోటీసులను రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లో రాజ్ పాకాల ఇంటికి అంటించారు. మరోవైపు రాజ్ పాకాల ఈ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిఅత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోర్టును కోరారు.