తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ పలు చోట్ల డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ భారీగా పట్టుపడ్డాయి. మొగుడంపల్లి మండలం మాడిగి వద్ద అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ లారీలో డ్రగ్స్ తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులను చూసి లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయారు. డ్రగ్స్ ను చిరాగ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. పోలీసులు పట్టుకున్న డ్రగ్స్ విలువ రూ.100 కోట్లు ఉంటుందని సమాచారం. వీటిని ఏపీలోని ఓడరేవు నుంచి ముంబై తరలించేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ తరలిస్తున్నందున దీని వెనక ఎవరున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.