భారత ప్రముఖ వ్యాపార వేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. అనారోగ్య పరిస్థితుల కారణంగా సోమవారం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. కంపెనీ లాభాల్లో సింహభాగం విరాళాలకే కేటాయిస్తూ దాతృత్వాన్ని చూపిన రతన్ టాటా మృతితో ప్రజలు, ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా దేశ, విదేశ ప్రముఖులు, ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. రతన్ టాటా మృతి పట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. దూరదృష్టి గల వ్యాపారవేత్త రతన్ టాటా, సమాజ హితం కోసం రతన్ టాటా పని చేశారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. మెరుగైన సమాజం కోసం రతన్ టాటా కృషి చేశారని.. పారిశ్రామిక రంగం, దాతృత్వంలో భావితరాలకు రతన్ టాటా ఆదర్శం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దేశ పారిశ్రామిక రంగానికి నిజమైన ఐకాన్ రతన్ టాటా అని., దేశ నిర్మాణానికి రతన్ టాటా సహకారం అందించడంతో పాటు, దేశానికి రతన్ టాటా సేవలు స్పూర్తిదాయకమని ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు.