కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెరిగిపోయాయని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పలువురు వైసీపీ నేతలపై కేసులు, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అక్రమంగా అరెస్టు చేశారని సజ్జల మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఎప్పుడూ ఇలా లేని పోని కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలను ఇబ్బందుల పాలు చేయలేదని పేర్కొన్నారు. ప్రజలు పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు కానీ, అక్రమ కేసులు పెట్టేందుకు, అక్రమ వసూళ్లు చేసేందుకు కాదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైయస్ జగన్ అభిమాని ఐతే చాలు అరెస్టు చేయడం పరిపాటి అయిపోయిందన్నారు. దెబ్బ తిన్న వాళ్లకు తెలుసు దెబ్బ ఎలా కొట్టాలో తెలుసని, తాము కొట్టే దెబ్బ చాలా బలంగా ఉంటుందని సజ్జల వ్యాఖ్యానించారు.