పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి పునరుద్ఘాటించారు. ప్రభాస్ ఎవరో తనకు ఇప్పటికీ తెలియదని స్పష్టం చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్ తన స్వప్రయోజనాల కోసం చెల్లి, తల్లి పేర్లను వాడుకుంటున్నారని మండిపడ్డారు. బాలకృష్ణ నివాసంలో ఉన్న ఐపీ అడ్రస్ నుంచి తనపై తప్పుడు ప్రచారం జరిగిందని జగన్ కేసు పెట్టినట్లు ఇటీవల చెప్పారన్నారు.చెల్లెలిపై ప్రేమ ఉంటే, బాలకృష్ణ నివాసంలో నుంచి తప్పుడు ప్రచారం జరిగితే ఐదేళ్లు సీఎంగా ఉండి ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. ప్రభాస్ అనే వ్యక్తిని ఇంత వరకూ చూడలేదని, తన బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పారు. ప్రభాస్ ఎవరో తనకు ఇప్పటికీ తెలియదని, ఆయనతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. జగన్ తనకు మైలేజీ కోసం తల్లి, చెల్లి అనే తేడా లేకుండా వాడుకుంటున్నారని విమర్శించారు.