ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో బాంబు బెదిరింపులపై స్థానికులు, భక్తులు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు పేర్కొన్నారు. ఇటీవల తిరుపతిలోని పలు హోటళ్లకు, విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు రావడం తెలిసిందే. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. దేశవిదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే పుణ్యక్షేత్రంలో వరుస బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఐఎస్‌ఐ పేరుతో హోటళ్లకు ఈ మెయిల్స్ వస్తున్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎక్కడా పేలుడుకు సంబంధించిన పదార్థాలు లభ్యం కాలేదు. దీంతో పోలీసులు కీలక ప్రకటన చేశారు. తిరుపతి నగరవాసులతో పాటు శ్రీవారి భక్తులు ఎలాంటి భయాందోళన చెందవద్దన్నారు. బాంబు బెదిరింపులపై ప్రత్యేక సైబర్ టీం, ఐటీ, సహా ఇతర విభాగాల ఆధ్వర్యంలో విచారణ జరిపిస్తున్నామన్నారు. నగరంలో భద్రత పెంచినట్లు వెల్లడించారు. నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణలో ప్రతి ఒక్కరి కదలికను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. హోటళ్లకు వస్తున్న మెయిల్స్ పై కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ సహకారంతో దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు తనిఖీలు చేసిన హోటళ్లలో ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదన్నారు.