ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల మౌనీ అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తుల రాకతో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.దీనిపై విశాల్ తివారీ అనే లాయర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనకు యూపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని, దేశ నలుమూలల నుంచి కుంభమేళాకు వచ్చే భక్తుల భద్రతకు హామీ ఇవ్వాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా మార్గదర్శకాలు రూపొందిస్తూ రాష్ట్రాలకు స్పష్టమైన విధానాలు అందించాలని కోరారు. దీనిపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కుంభమేళా తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, ఆందోళన కలిగించే విషయమని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే పిటిషన్ విచారణను మాత్రం తిరస్కరించింది. దీనిపై అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.