Site icon

స్వలింగ వివాహాలపై సుప్రీం సంచలన తీర్పు!

స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధత విషయంలో దాఖలైన పిటిషన్ల మీద సుప్రీం కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఈ పిటిషన్ల మీద నాలుగు వేర్వేరు తీర్పులను వెలువరించింది. ఈ సందర్భంగా దేశ అత్యున్న న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. స్వలింగ సంపర్కం అనేది నగరాలు లేదా సమాజంలోని ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైనదనే అభిప్రాయం నుంచి బయటపడాలని తెలిపింది. సె*క్సువల్ ధోరణుల ఆధారంగా వ్యక్తులపై వివక్ష చూపకూడదని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

స్వలింగ సంపర్కుల వివాహాల కేసులో మొత్తం నాలుగు తీర్పులను ఇవ్వనున్నట్లు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. చట్టాలను కోర్టులు తయారు చేయవని.. కానీ ఆ చట్టాలను అర్థం చేసుకొని అమలు చేస్తాయని సీజేఐ అన్నారు. ఇక మ్యారేజ్ సిస్టమ్ అనేది స్థిరమైనదని, దాన్ని మార్చలేమని అనుకోవడం సరికాదన్నారు. ఒకవేళ స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని గనుక తీసుకురాకపోతే.. మనం మళ్లీ దేశ స్వాతంత్ర్యానికి పూర్తపు స్థితికి వెళ్లినట్లేనని డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు.

ప్రత్యేక వివాహ చట్టం అవసరమా? కాదా? అనేది పార్లమెంట్ నిర్ణయిస్తుందని.. ఈ విషయంలో చట్టపరిధిలోకి కోర్టు వెళ్లాలనుకోవడం లేదని జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పుకొచ్చారు. పెళ్లికాని జంటలతో పాటు స్వలింగ సంపర్కులు కూడా బిడ్డలను దత్తత తీసుకోవచ్చని సీజేఐ తెలిపారు. భిన్న లింగాల జంటలే మంచి పేరెంట్స్ గా ఉంటారని చట్టం భావించట్లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ పిటిషన్ల మీద ఇంకా తుది తీర్పు వెలువడలేదు. వీటిపై రాజ్యాంగ ధర్మాసనంలోని మిగిలిన జడ్జిలు తమ తీర్పులను వెల్లడిస్తున్నారు. ఈ కేసులో జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 10 రోజుల పాటు సుదీర్ఘ విచారణ చేపట్టిన తర్వాత మే 11వ తేదీన తన తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ ఈ కేసులో తీర్పును వెలువరిస్తోంది.

Share
Exit mobile version