ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ముగ్గురు, జనసేన, బీజేపీలు చెరో అభ్యర్థిని ప్రకటించిన సంగతి తెలిసిందే. జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజు, టీడీపీ నుంచి బీటీ నాయుడు, బీద రవిచంద్ర, కావలి గ్రీష్మలకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో టీడీపీ పిఠాపురం నేత వర్మ దీనిపై ఆగ్రహంగా ఉన్నారని వార్తలొచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును జనసేన అధినేత పవన్ కల్యాన్‌కు వర్మ త్యాగం చేసిన సంగతి తెలిసిందే. కాగా, కూటమి అధికారంలోకి వచ్చాక వర్మకు పెద్ద పదవి వరిస్తుందనే అంతా అనుకున్నారు. ఎమ్మెల్సీ ప్రకటన రావడంతో వర్మ ఎమ్మెల్సీ కావడం ఖాయమని అంతా భావించారు. కానీ, టీడీపీ ప్రకటించిన జాబితాలో వర్మ పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై వర్మ స్పందించారు. పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎన్నో ఇబ్బందులుంటాయని, నియోజకవర్గ స్థాయిలోనే పదవులు కేటాయించడానికి ఎన్నో ఇబ్బందులు పడతామని, రాష్ట్రవ్యాప్తంగా పదవులు ఇవ్వాలంటే ఇంకా కష్టమైన పని అని పేర్కొన్నారు. పార్టీ అధిష్టానాన్ని ఈ విషయంలో అర్థం చేసుకుంటానన్నారు. సీఎం చంద్రబాబుతో 23 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సమస్యలపై కలిసి పని చేశానని, చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆదేశాలకు తనతో పాటు తన కుటుంబం, పిఠాపురం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు. దీంతో వర్మ ఎమ్మెల్సీ పదవి రాకపోవడంపై ఎలాంటి అసంతృప్తితో లేరని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.