బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్రమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు టీ కాంగ్రెస్ నేతలు ట్యాంక్‌బండ్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అమిత్ షా వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆయా రాష్ట్రాల్లో నిరసన తెలుపుతున్నారు. అమిత్ షా వ్యాఖ్యలు దేశాన్నే కించపర్చేలా ఉన్నాయని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పాలకులే స్వయంగా పార్లమెంట్‌లో అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన మంత్రి తుమ్మలతో కలిసి పాల్గొన్నారు.