ఏపీలో మద్యం దుకాణాల టెండర్లు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3396 దుకాణాలు ఉండగా ఇప్పటి వరకు సుమారు 1500 దుకాణాలు టెండర్లు పూర్తయినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 86 షాపుల కేటాయింపు పూర్తయ్యింది. ఇక కర్నూలు జిల్లాలో అతి తక్కువగా కేవలం 19 దుకాణాలకే లాటరీ పూర్తయ్యింది. 26 జిల్లాల్లో మద్యం షాపుల కేటాయింపునకు లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. కొత్తగా ఏపీలో ఇతర రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి మద్యం దుకాణాలు దక్కడం విశేషం. మచిలీపట్నంలో రెండు వైన్‌షాపులను ఇతర రాష్ట్రాలకు చెందిన వారు దక్కించుకున్నారు. పట్టణంలోని ఒకటో నంబర్ దుకాణం కర్ణాటకకు చెందిన మహేశ్ ఎ బాతే, రెండో నంబర్ షాపు యూపీ వాసి లోకేశ్ చంద్‌కు దక్కాయి. లాటరీలో వారి పేర్లు రావడంతో ఆనందం వ్యక్తం చేశారు.లాటరీ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ నెల 16 నుంచి నూతన మద్యం పాలసీ ప్రారంభం కానుంది. ప్రైవేటు మద్యం షాపుల్లో కొత్త లిక్కర్ బ్రాండ్లు రానున్నాయి. ప్రీమియం బ్రాండ్ల మద్యం బాటిళ్లు ఇప్పటికే స్టాక్ పాయింట్లకు చేరుకుంటున్నాయి.