ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. ఏపీ పంచాయితీ రాజ్ బిల్లు, మున్సిపల్ బిల్లులను మంత్రి నారాయణ ప్రవేశపెట్టగా, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లును మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా శాసనమండలి గురువారానికి వాయిదా పడింది. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ గురించి శాసనమండలిలో చర్చ నడిచింది. చర్చలో మంత్రులు, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయించలేదని, కనీసం స్పష్టత కూడా ఇవ్వలేదని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని అడిగితే, లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్తున్నారని, హామీలు ఇచ్చేటప్పుడు ఆ అప్పులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం మాట్లాడుతూ.. నాలుగున్నర నెలల పసికూన ప్రభుత్వాన్ని నిందించవద్దని హితవు పలికింది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.