– జనగామలో 30 మేకలు ఎత్తుకెళ్లిన దుండగులు
సిటీలో పండుగల వేళ దొంగతనాలు జరగడం, పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం కామన్. ఎందుకంటే అందరూ పండక్కి ఇళ్లకు తాళాలేసి సొంతూళ్లకు వెళ్తుంటారు. అయితే పండగ పూట గ్రామాల్లో కూడా దొంగతనాలు జరగడం కలకలం రేపుతోంది. తెలంగాణలో దసరా అనేది చాలా పెద్ద పండగ. చిన్నా పెద్దా అంతా ఇంట్లోనే కలిసి చేసుకునే పండగ ఇది. ఈ పండగలో ప్రతి ఇంటా ముక్కా, చుక్కా కామన్. ఇక మాంసం అమ్మకం దారులకు గిరాకీ మామూలుగా ఉండదు. ప్రతి షాపు ముందు క్యూ కట్టాల్సిందే. దీంతో మటన్, చికెన్‌కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. మార్కెట్‌లో మేకలు, గొర్రెలు కొనేందుకు ఎగబడతారు. ఈ సమయంలో మేకలకు, గొర్రెల ధరలు కూడా భారీగా పెరుగుతాయి. ధర ఎక్కువ అని పండగ పూట మాంసం కొనకుండా ఉండలేరు. ఇక ఈ డిమాండ్‌ను చూసిన కొందరు దొంగలు మేకలు, గొర్రెలపై పడ్డారు. జనగామ జిల్లాలో మేకల దొంగలు హల్చల్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని బీరప్ప గడ్డలో కెమిడి లక్ష్మయ్యకు చెందిన 30 మేకలను అర్థరాత్రి గుర్తు తెలియని దొంగలు కొట్టం నుంచి ఎత్తుకెళ్లారు. పండగ సమయంలో జిల్లాలో మేకల దొంగతనం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై బాధితుడు లక్ష్మయ్య ఠాణాలో ఫిర్యాదు చేశాడు. చోరీకి గురైన మేకల విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగల కోసం గాలిస్తున్నారు. మేకలు, గొర్ల యజమానులు దసరా అయిపోయే వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.