గచ్చిబౌలిలోని కంచ భూముల వేలంపై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ దారుణంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బండి సంజయ్ ఓ పోస్టు చేశారు. కంచ గచ్చిబౌలి భూమి అమ్మకం కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశవాదమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయడానికి ప్లాన్ చేసిన 400 ఎకరాలు అటవీ పరిమితుల పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. కేంద్రం అనుమతి లేకుండా అటవీ నిర్మూలనను సుప్రీం కోర్టు స్పష్టంగా నిషేధిస్తుందని చెప్పారు. ఈ భూమి హైకోర్టులో ఉందని, ఏప్రిల్ 7 లోపు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందని, అయినప్పటికీ, ప్రభుత్వం కోర్టును ధిక్కరిస్తూ చెట్లను నరికివేస్తూ పర్యావరణాన్ని నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కంటే దారుణంగా ఉందన్నారు. అక్రమ అటవీ నిర్మూలన, వేలం ద్వారా వేల కోట్లు దోచుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఒకసారి ఇటువంటి భూమి అమ్మకాలను వ్యతిరేకించలేదా? అని గుర్తు చేశారు. ధనవంతులకు భవిష్యత్ నగరం, భవిష్యత్ తరాలకు లాఠీలు – ఇది కాంగ్రెస్ నమూనానా? అని ప్రశ్నించారు. వేలం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే ప్రజలు గుణపాఠం నేర్పుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.