మూసీ పరివాహక ప్రాంతంలోని బాధితుల కోసం తాము చావడానికైనా సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బుల్డోజర్లతో తొక్కిస్తామని సీఎం అంటున్నారు.. ఎలా తొక్కిస్తారో చూస్తామని సవాల్ విసిరారు. ఆట చూస్తాం.. తొక్కేయడం ఎలా తొక్కిస్తారో.. ఒక సీఎం ఇలానేనా మాట్లాడేది అంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మూసీ ప్రక్షాళన చేయండి.. కానీ పేదల ఇల్లు కూలకొట్టకండి అనేదే తమ నినాదమన్నారు.రేపు మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించి ప్రజలకు భరోసా కల్పిస్తామన్నారు. బీజేపీని రెచ్చగొడి తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క విషయంలో ముందుకు కదలదన్నారు. రాష్ట్రంలో అమృత్ పథకంలో అవినీతి జరిగితే విచారణ జరగాల్సిందేనన్నారు. ఎన్నికల్లో రైతులకు హామీ ఇచ్చిన మేరకు బోనస్ ఇచ్చే సత్తా ఈ ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు.గతంలో ఫార్మ్ హౌస్ లో వీడియోలు తీసి బీఆర్ఎస్, కేసీఆర్ ఏ విధంగా ఉపయోగించుకున్నారో రేవంత్ రెడ్డి కూడా అలానే చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నా పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే కలెక్టర్ పై దాడి జరగడం, రైతులను అరెస్ట్ చేయడం దారుణమని, తెలంగాణ ఎక్కడికి వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.