పార్శిల్‌లో డెడ్ బాడీ.. బెదిరింపు లేఖ‌!

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో దారుణ‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ ఇంటికి గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి పార్శిల్ రాగా, అందులో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత దేహం ఉండ‌టం క‌ల‌క‌లం రేపింది. డ‌బ్బాలో ఉన్న మృత దేహాన్ని చూసి స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ప‌లువురు పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో జిల్లా ఎస్పీ నయీం అస్మి గ్రామానికి చేరుకొని పార్శిల్‌ను ప‌రిశీలించారు. పార్శిల్ డ‌బ్బాలో సుమారు 45 ఏళ్ల‌ వయసున్న గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం సగ భాగం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు మాట్లాడుతూ.. సాగి తులసి అనే మహిళకు యండగండి గ్రామంలో ప్రభుత్వం నుంచి స్థలం మంజూరైన‌ట్లు తెలిపారు. ఆమె ఆ స్థ‌లంలో ఇల్లు క‌ట్టుకుంటోంది. నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఆ ఇంటిని పూర్తి చేయ‌డం కోసం ఆమె క్షత్రియ సేవా సమితిని ఆర్థిక సాయం కోరుతూ దరఖాస్తు పెట్టుకుంది. మొదటి విడతలో సేవా సమితి టైల్స్‌ అందజేశారు. రెండో సారి విద్యుత్ సామ‌గ్రి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా పార్శిల్‌లో సామగ్రికి బదులు మృతదేహం వచ్చింది. దీంతో ఒక్క‌సారిగా అంద‌రూ దిగ్భ్రాంతికి గుర‌య్యారు. పార్శిల్‌లో ఒక ఉత్తరం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో రూ.1.30 కోట్లు చెల్లించాలని, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని రాసి ఉంద‌న్నారు. మ‌హిళ కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *