హైదరాబాద్లో గురువారం సాయంత్ర వేళ అకాల వర్షానికి నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రజల రాకపోకలకు సమస్యలు ఎదురయ్యాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్లు విరిగిపడ్డాయి. అకాల వర్షానికి మూసీ నదికి వరద ప్రవాహం పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం సమీపంలోని భీమలింగం వద్ద లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
పెచ్చులూడిన చార్మినార్…
నగరంలో కురుసిన వర్షం ధాటికి చార్మినార్ పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఆ సమయంలో పర్యాటకులు ఎవరూ మినార్ కింద లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన వెంటనే పర్యాటకులు భయంతో పరుగులు పెట్టారు. గతంలో మరమ్మతులు చేసిన ఓ మినార్ పెచ్చులు ఊడినట్లు అధికారులు తెలిపారు. సమీపంలో పడిపోయిన పెచ్చులను తొలగించారు.