ఇటీవల పలు వివాదాస్పద ఘటనలతో వార్తల్లో నిలుస్తున్న తెలంగాణ మంత్రి కొండా సురేఖకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాకిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏడుగురు ఎమ్మెల్యేలు కొండా సురేఖపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కొండా సురేఖతో పాటు ఆమె వర్గం తీరు పార్టీ నష్టం కలిగించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపా మున్షీతో భేటీ అయ్యి ఈ విషయంపై చర్చించారు. అనంతరం టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌తో కూడా దీనిపై మాట్లాడినట్లు సమాచారం. ఇటీవల సినీ నటులు నాగచైతన్య, సమంతల విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై యావత్ సినీలోకం మండిపడింది. నాగార్జున ఈ అంశంలో కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. మాజీ మంత్రి కేటీఆర్ సైతం పరువు నష్టం దావా వేశారు. ఇది దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపింది. కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సైతం కొండా సురేఖను బహిరంగంగానే మందలించారు. మరో వైపు నియోజకర్గంలో సైతం సొంత పార్టీ నేతలతో కొండా సురేఖకు పడటంలేదు. దీంతో అధిష్టానం కొండా సురేఖపై ఏం నిర్ణయం తీసుకుంటుందోనని రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.