సార్వత్రిక ఎన్నికల అనంతరం వైసీపీకి ఆ పార్టీ నేతలు వరుస గుడ్ బైలు చెబుతున్నారు. అధికార కూటమిలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరారు. కాగా, రాజ్యసభ సభ్యత్వానికి ఇప్పటికే రాజీనామా చేసిన వైసీపీ సీనియర్ నేతలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు నేడు టీడీపీలో చేరనున్నారు.ఈ రోజు సాయంత్రం ఉండవల్లిలోని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకోనున్నారు. వీరితో పాటు పెద్ద సంఖ్యలో వారి వారి అనుచరులు కూడా టీడీపీలో చేరుతారని తెలుస్తోంది.