ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కడం అలవాటుగా మారిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై వైయస్ జగన్ సీఎం చంద్రబాబును నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై ఇంతటి బరితెగింపు దేనికని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా అని ప్రశ్నించారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏటా రూ.15 వేలు ఇస్తామని అధికారంలోకి రాగానే ఈ ఏడాదికి ఇవ్వమని చెప్పారన్నారు. కూటమి నేతలు ఇంటింటికీ తిరిగి పథకాలపై ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందన్నారు. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా గడిపేశారన్నారు.మహిళలు, పిల్లలు, రైతులులతో పాటు వాలంటీర్లను మోసగించారని మండిపడ్డారు. కూటమి పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోందన్నారు. ప్రతి అడుగులోనూ స్కాంలేనని, ఇసుక, మద్యాన్ని కూడా వదలడం లేదని విమర్శించారు.