ఏపీలో కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చుకోలేక ప్రశ్నిస్తున్న యువతపై కేసులు పెట్టి అణిచివేస్తోందని వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ పలువురిని అరెస్ట్ చేస్తున్న సందర్భంగా వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సారి రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. పాలకులే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటినా హామీల అమలు లేదన్నారు. ప్రతి వర్గాన్ని మోసం చేసి, అన్ని వ్యవస్థలను నీరుగార్చారని విమర్శించారు. రాష్ట్రంలో పదుల సంఖ్యలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరగగా ఏడుగురు చనిపోయారన్నారు. టీడీపీ కార్యకర్తలే ఈ పనులు చేస్తున్నారని, ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు. తెనాలిలో సహానా అనే యువతిపై టీడీపీ రౌడీషీటర్ దాడి చేసి హత్య చేశాడని అన్నారు. శ్రీకాకుళంలో ఇద్దరు బాలికలపై అధికార పార్టీ నేతల కుమారులు అత్యాచారం చేశారని పేర్కొన్నారు. హిందూపూర్‌లో అత్తాకోడళ్లపై అత్యాచారం జరిగిందని, కనీసం స్థానిక ఎమ్మెల్యే బాధితులను పరామర్శించలేదని విమర్శించారు. పిఠాపురంలో డంప్ యార్డ్‌లో ఓ బాలికపై అత్యాచారం చేశారని,చంద్రగిరిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడేళ్ల లోపు శిక్ష ఉన్న కేసుల్లో కేవలం 41ఏ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆర్డర్ ఉందన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను ఇబ్బంది పెట్టడం కోసం కుటుంబ సభ్యులను కూడా స్టేషన్ కు తీసుకు వస్తున్నారని మండిపడ్డారు. లోకేష్, పవన్ డీజీపీ మీద ఒత్తిడి తెచ్చి ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. డీజీపీ, పోలీసులు తమ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు మాత్రమే సెల్యూట్ చేయాలని, వేరే వారికి సెల్యూట్ చేస్తే వృత్తిని కించ పరిచినట్టేనని అన్నారు. పోలీసులు కూడా మనస్సాక్షిని ప్రశ్నించు కోవాలని సూచించారు.