జ్వరం వచ్చిందంటే చాలు.. పెద్దలు, పిల్లలు అనే తేడాల్లేకుండా అందరూ వేసుకునే టాబ్లెట్‌గా పారాసెటమాల్‌ను చెప్పొచ్చు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా లేకుండా, అసలు వైద్యుడ్ని కలవకుండానే ఒంట్లో నలతగా అనిపిస్తే వెంటనే ఈ మాత్రను వేసుకోవడం చూస్తూనే ఉంటాం. పైగా మొన్నటివరకు కొవిడ్-19 విజృంభిస్తుండటంతో అందరి ఇళ్లలోనూ పారాసెటమాల్ టాబ్లెట్ షీట్స్ ఉండటం కామన్ అయిపోయింది. జ్వరంతో పాటు తలనొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు లాంటి సమస్యలకు కూడా ఈ ట్యాబ్లెట్లను విరివిగా వాడేస్తున్నారు. అయితే ఈ ట్యాబ్లెట్లను అడ్డగోలుగా వేసుకోవడం ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
పారాసెటమాల్ ట్యాబ్లెట్లను లిమిట్‌కు మించి వేసుకుంటే అధిక చెమటలు, విరోచనాలు, కళ్లు తిరగడం, వాంతులు, చర్మ సంబంధిత సమస్యలు, ఆకలి తగ్గిపోవడం, కడుపు నొప్పి, అలర్జీలు లాంటి సమస్యలు వస్తాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఈ మాత్రల్లో స్టెరాయిడ్స్ ఉంటాయని.. వీటిని పరిమితికి మించి తీసుకుంటే మూత్రపిండాలు, కాలేయం లాంటి అవయవాల మీద తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మూత్రపిండాలు, కాలేయం వంటి వ్యాధులతో బాధపడుతున్న వారైతే డాక్టర్లను సంప్రదించకుండా పారాసెటమాల్, క్రోసిన్, డోలో లాంటి ట్యాబ్లెట్లను అస్సలు వాదొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
జ్వరం త్వరగా తగ్గాలనే ఉద్దేశంతో చాలా మంది యాంటీ బయోటిక్స్ వాడుతుంటారు. అయితే ఈ యాంటీ బయోటిక్స్ అధికంగా తీసుకుంటే దీర్ఘకాలంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వైరస్, బ్యాక్టీరియాలు యాంటీ బయోటిక్స్‌కు అలవాటు పడి మొండిగా మారతాయని హెచ్చరిస్తున్నారు. అందుకే యాంటీ బయోటిక్స్ ను ఎక్కువగా యూజ్ చేయొద్దని చెబుతున్నారు. జ్వరం, తలనొప్పి, జలులు, ఒళ్లు నొప్పులు లాంటి సమస్యలు ఉంటే డాక్టర్లను సంప్రదించిన తర్వాతే మందులు వాడాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూనే వేసుకునే మందుల విషయంలోనూ కేర్‌ఫుల్‌గా ఉండాలని డాక్టర్లు అంటున్నారు.