Site icon

మా నాన్న సూప‌ర్ హీరో రివ్యూ

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన హీరో సుధీర్ బాబు. ముందు చిన్న చిన్న సినిమాల‌తో ప‌ల‌క‌రించినా రోజులు గ‌డిచే కొద్దీ త‌న స్టార్ డ‌మ్ పెంచుకుంటూ పెద్ద సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా లెవెల్ సినిమాలు కూడా చేసేస్తున్నాడు. తాజాగా సుధీర్‌ మా నాన్న సూపర్ హీరో అనే సినిమా చేశాడు. లూజర్ వెబ్ సిరీస్ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వీ సెల్యులాయిడ్ బ్యానర్ మీద సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మించారు. టీజర్, ట్రైలర్ తో ఒక మంచి ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చేందుకు వస్తున్నామని ముందు నుంచి మేకర్స్ చెబుతూ వచ్చారు.
ప్ర‌మోష‌న్స్ కూడా చాలా డిఫ‌రెంట్‌గా చేశారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెరిగిపోయాయి. మ‌రి మా నాన్న సూప‌ర్ హీరో ఎలా ఉందో చూసేయండి..

కథ: ఓ తండ్రి తన కొడుకును ఓ అనాథాశ్రమంలో వదిలి వెళ్తాడు. అనుకోని ప‌రిస్థితుల‌తో అత‌డు పాతికేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి వ‌చ్చి కొడుక్కి దూరమైపోతాడు. ఆ బాబును అనాథాశ్ర‌మం నుంచి ఓ వ్యాపార వేత్త‌ దత్తత తీసుకుంటాడు. దత్తత తీసుకున్న తర్వాత తనకు దురదృష్టం మొదలయిందని భావించి ఆ బాబును చాలా నీచంగా చూస్తుంటాడు. కన్న తండ్రి అనాథాశ్రమంలో వదిలి వెళ్తే అత‌డు ప్రేమగా పెంచుకుంటున్నాడ‌ని భావిస్తూ ఉండే ఆ బాబు తండ్రి ఎన్ని మాటలు అన్నా భ‌రిస్తూ ఉంటాడు. తండ్రి చేసే అప్పులన్నీ క‌డుతూ ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొంటాడు. ఈ క్ర‌మంలో త‌న తండ్రి జైలులో ఉన్న కార‌ణంగా బ‌య‌ట‌కు ర‌ప్పించేందుకు ఓ రాజ‌కీయ నాయ‌కుడికి రూ.కోటి క‌ట్టాల్సి వ‌స్తుంది. అత‌డు ఆ కోటి రూపాయ‌లు ఎలా క‌ట్టాడు? త‌న సొంత‌ తండ్రిని క‌లిశాడా లేదా? త‌న పెంపుడు తండ్రిని జైలు నుంచి ఎలా విడిపించాడు? అనేది అస‌లు క‌థ‌.

విశ్లేషణ :
టాలీవుడ్‌లో అమ్మ ప్రేమ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. నాన్న ప్రేమ నేపథ్యంలో కొన్నే సినిమాలు వచ్చాయి. కానీ ఈ నాన్న ప్రేమలో కూడా కొత్త కోణాన్ని చూపిస్తూ డైరెక్ట‌ర్ మంచి ప్ర‌య‌త్నం చేశారు. డైరెక్ట‌ర్‌ అభిలాష్ మొదటి సినిమాను ఏదో కమర్షియల్ ఫార్మాట్‌లో కాకుండా ప్రేక్షకులు గుండెలను హత్తుకునే విధంగా తెర‌కెక్కించాడు. మా నాన్న సూపర్ హీరో అనేది ఇద్దరు తండ్రులు ఓ కొడుకు మధ్య సాగే ఒక ఆసక్తికరమైన క‌థ‌. తన కొడుకుని చిన్నప్పుడే దూరం చేసుకొని ఎలాగైనా అతడిని కలవాలనుకునే ఓ తండ్రి ఆరాటం ఓవైపు.. అనాథాశ్రమం నుంచి ఆ కుర్రాడిని తెచ్చి ప్రేమగా పెంచి నష్టాల వల్ల అతని మీద మనసు విరిగిపోయిన మరో తండ్రి మ‌రో వైపు… చిన్ననాడే తనను కన్న తండ్రి వదిలేస్తే ఎంతో ప్రేమగా పెంచుకునే తండ్రి వ్యాపారంలో నష్టాల వల్ల తనను ఎన్ని మాటలు అంటున్నా అతడిని కంటికి రెప్పలా కాపాడుకునే కొడుకు ఇంకో వైపు… ఇలా ఒక కొడుకు ఇద్ద‌రు తండ్రుల మ‌ధ్య జ‌రిగే ఆసక్తికరమైన క‌థ మా నాన్న సూప‌ర్ హీరో. తన కన్న కొడుకు కోసం ఓ తండ్రి వెతుక్కుంటూ రావడంతో కథ మొదలవుతుంది. చిన్నప్పుడు విడిపోయిన తండ్రీ కొడుకులు ఎలా కలుసుకుంటారా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సమయంలోనే కోటిన్నర రూపాయల లాటరీ టికెట్ అనే మరొక ఆసక్తికరమైన ఎలిమెంట్ తో కథ మరో మలుపు తీసుకుంటుంది. ఆ తండ్రి తన కొడుకుని చేరుకున్నాడా? తనను అసహ్యించుకునే తండ్రిని కూడా ప్రేమించేలా కొడుకు ఎలా చేసుకున్నాడు? లాంటి విషయాలను చాలా కన్విన్సింగ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇలాంటి కథను ఎంచుకోవడమే పెద్ద సాహసం. నటీనటుల విషయానికి వస్తే సుధీర్ బాబు కెరీర్ లో ఇది ఒక భిన్నమైన పాత్ర. ఇప్పటి వరకు క‌మ‌ర్షియ‌ల్‌ సినిమాల్లో హీరోగా చేసిన సుధీర్‌ను ఈ సినిమాలో ఒక సెటిల్డ్ రోల్ లో చూస్తారు. సుధీర్ మంచి న‌ట‌న‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. శియాజీ షిండే, సాయిచంద్, శశాంక్ సహా మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. హీరోయిన్ పాత్ర కేవలం ఒక సపోర్టింగ్ రోల్ లాగా మాత్రమే అనిపించింది. ఉన్నంతలో ఆమె పర్వాలేదనిపించింది. టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమాలో అండర్ కరెంట్ గా సంగీతం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఏదో కావాలని పాటలు ఇరికించినట్లు కాకుండా కథలో భాగంగా వచ్చేలా ఉన్నాయి. ఇక నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కమర్షియల్ హంగులు జోలికి వెళ్లకుండా అసభ్యతకు తావు లేకుండా ప్రేక్షకుల మనసు హత్తుకునేలా ఈ సినిమాను చేయడం ఒక సాహసమే. కమర్షియల్ హంగుల కోసమే సినిమాలు చేస్తున్న ఈ రోజుల్లో ఇది ఒక భిన్నమైన ప్రయత్నం. ఆ విష‌యంలో మా నాన్న సూప‌ర్ హీరో టీంను అభినందిచాల్సిందే!

Share
Exit mobile version