టాటా… ర‌త‌న్‌!

ర‌త‌న్ టాటా…. భార‌త ప్ర‌జ‌ల‌కు ఎంతో సుప‌రిచిత‌మైన వ్య‌క్తి. నిత్య‌వ‌స‌రంగా వాడే గుండు పిన్ను, ఉప్పు ద‌గ్గ‌రి నుంచి కార్లు, విమానం వ‌ర‌కు పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్ల‌ను దృష్టిలో ఉంచుకొని ఎన్నో సంస్థ‌లు స్థాపించిన గొప్ప వ్యాపార‌వేత్త‌. టాటా గ్రూప్స్ లో త‌మ‌కు వ‌చ్చిన ఆదాయంలో స‌గానికిపైగా చారిటీల పేరిట‌ విరాళాలు ఇస్తూ దేశంలో ఏ వ్యాపార వేత్త‌కు లేనంత గొప్ప పేరు సంపాదించుకున్నారు. 86 ఏళ్ల ర‌త‌న్ టాటా ముంబైలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ అక్టోబ‌ర్ 8న అర్ధ‌రాత్రి తుది శ్వాస విడిచారు. ర‌త‌న్ టాటా లాంటి వ్య‌క్తి మృతి దేశానికే తీర‌ని లోటు. ర‌త‌న్ టాటా మంచిత‌నానికి, సేవా గుణానికి చిరునామాగా నిలిచారు. యువ వ్యాపార వేత్త‌ల‌కు ఆయ‌న‌ జీవితం ఓ స్ఫూర్తి పాఠం. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు, ఆయ‌న జీవ‌న శైలి భావి త‌రాల‌కు ఆద‌ర్శ‌నీయం.

కుటుంబం…
రతన్ టాటా ముంబైలో 1937 డిసెంబర్ 28న ఓ పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో జ‌న్మించారు. సూరత్‌లో జన్మించి, తరువాత టాటా కుటుంబంలోకి దత్తత తీసుకోబ‌డ్డ టాటా నావల్ టాటా, టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా మేనకోడలు సూని టాటాలు ఆయ‌న త‌ల్లిదండ్రులు. 1948లో ర‌త‌న్ టాటాకు ప‌దేళ్ల‌ వయస్సు ఉన్నప్పుడు ఆయ‌న‌ తల్లిదండ్రులు విడిపోయారు. అప్ప‌టి నుంచి ర‌త‌న్ టాటా అత‌ని నాన‌మ్మ‌ చేత పెంచ‌బ‌డ్డాడు. ర‌త‌న్ టాటా అవివాహితుడు. నాలుగు సార్లు పెళ్లి దాకా వ‌చ్చారు కానీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాలేదు. లాస్ ఏంజెల్స్‌లో ఉన్నప్పుడు ఒక‌మ్మాయితో ప్రేమ‌లో ప‌డ్డాను అని టాటా చెప్పారు. 1962 ఇండో – చైనా యుద్ధం కార‌ణంగా ఆమె త‌ల్లిదండ్రులు ఇండియాకు పంపించేందుకు అంగీక‌రించ‌లేదు. అలా ల‌వ్ మ్యారేజ్‌కు బ్రేక్ ప‌డింద‌ని తెలిపారు.

విద్యాభ్యాసం…
ర‌త‌న్ టాటా ఎనిమిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు వరకు ముంబైలోని క్యాంపియన్ స్కూల్‌లో చదివారు. తరువాత అతను ముంబైలోని కేథడ్రల్ జాన్ కానన్ స్కూల్, సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్, న్యూయార్క్ నగరంలోని రివర్‌డేల్ కంట్రీ స్కూల్‌లో చదువును కొనసాగించారు. రివర్‌డేల్ కంట్రీ స్కూల్‌లో ర‌త‌న్ టాటా 1955లో పట్ట భద్రుడయ్యారు. గ్రాడ్యుయేషన్ తర్వాత హైస్కూల్ నుంచి, టాటా కార్నెల్ విశ్వవిద్యాలయంలో చేరారు. 1959లో ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రుడయ్యారు. కార్నెల్‌లో ఉన్నప్పుడు టాటా ఆల్ఫా సిగ్మా ఫై ఫ్రాటర్నిటీలో సభ్యుడయ్యాడు. 2008లో టాటా కార్నెల్‌కు 50 మిలియన్ డాల‌ర్లు బహుమతిగా ఇచ్చింది. విశ్వవిద్యాలయ చరిత్రలో అతిపెద్ద అంతర్జాతీయ దాతగా అవతరించింది.

వృత్తి జీవితం….
1970లో ర‌త‌న్ టాటా ముందుగా టాటా స్టీల్‌ సంస్థలో షాప్‌ ఫ్లోర్‌లో ఉద్యోగిగా చేరారు. ఆ త‌ర్వాత‌ 1971లో నేషనల్‌ రేడియో, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టారు. 1977లో ఎంప్రెస్‌ మిల్స్‌కు మారారు. 1981లో టాటా ఇండ‌స్ట్రీస్ చైర్మన్ అయ్యారు. రెండేండ్లు తిరిగే సరికి 1983లో సాల్ట్ ఇండ‌స్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. తొలిసారిగా అయోడైజ్డ్ ఉప్పును ప్రవేశ‌పెట్టారు. టాటా నామ‌క్ – దేశ్ కా నామక్ ప్రచారంతో వినియోగ‌దారుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నారు. 1991లో జేఆర్‌డీ టాటా నుంచి టాటా సన్స్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు చైర్మన్‌గా ఉన్నారు. మళ్లీ అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించారు. ర‌త‌న్ టాటా 2009లో సామాన్యుల కోసం రూ.ల‌క్షకే నానో పేరుతో చీపెస్ట్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చారు.

ములుపు తిప్పిన పిలుపు…
గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక టాటాకు లాస్​ ఏంజెల్స్ లోని జోన్స్ అండ్ ఎమ్మోన్స్ ఆర్కిటెక్చర్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఆయన సుమారు రెండేళ్ల పాటు పని చేశారు. అప్పుడే ఆయనకు ఐబీఎంలో ఆఫర్​ వచ్చింది. అంతలోనే భార‌త్ నుంచి ఆయనకు హఠాత్తుగా ఓ వార్త‌ వచ్చింది. అన్నీ తానై పెంచిన నాయనమ్మ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో రతన్ టాటాను ఉన్నపళంగా ఇండియా వచ్చేయాలంటూ ఆమె నుంచి పిలుపు వచ్చింది. తమ సొంత వ్యాపారంలో టాటాలకు అండగా ఉండాలంటూ ఆమె రతన్ టాటాను కోరారు. కానీ తను పని చేసే సంస్థలోనే సహ ఉద్యోగి అయిన ఓ అమెరికన్ యువతిని ఆయన ప్రేమించారు. వీరిద్దరి పరిచయం కాస్త ప్రణయంగా మారింది. పెళ్లి చేసుకొని ఓ కొత్త లైఫ్​ను స్టార్ట్ చేద్దామని కలలు కంటున్న వేళ కలవరపరిచే ఘటనలు ఆయన్ను చుట్టుముట్టాయి. దీంతో తనతో ఇండియా వచ్చేయాలంటూ ప్రేయసిని రతన్ టాటా కోరారు. కానీ దానికి ఆ యువతి తల్లిదండ్రులు ససేమిరా ఒప్పుకోలేదు. అప్పుడు ఇండో చైనా యుద్ధం నడుస్తున్నందున ఇటువంటి పరిస్థితుల్లో తమ కుమార్తెను ఇండియాకు పంపబోమని వారు తేల్చి చెప్పారు. మాతృదేశం మీద ఆయనకున్న మమకారం, నాయనమ్మ అనురాగం ఆయన‌ను భార‌త్‌కు తిరిగి వచ్చేలా చేశాయి. అలా 1962లో రతన్ టాటా భారత్​కు తిరిగి వచ్చారు. నాయనమ్మ పిలుపే రతన్ టాటా జీవితానికి మలుపైంది. కానీ ఒక్కరినే ప్రేమించి వారినే పెళ్లాడలన్న ఫిలాసఫీకి కట్టుబడి ఉన్న ఆయన తన ప్రేయసి స్మృతులతో అలాగే జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు.

టాటా నానో కార్‌…
మ‌ధ్య త‌ర‌గ‌తి త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌తో బైక్‌పై వెళ్తూ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను చూసి ర‌త‌న్ టాటా చ‌లించి పోయారు. మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్లు కూడా కారుల్లో తిరిగేలా చేయాల‌ని భావించారు. త‌యారీ ఖ‌ర్చు ఎక్కువైనా సామాన్య ప్ర‌జ‌లు కొన‌గ‌లిగే విధంగా కారు తీసుకురావాల‌నుకున్నారు. రూ.ల‌క్ష రూపాయ‌ల‌కే మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్ల‌కు స‌రిపోయేలా టాటా నానో కారును ప్ర‌క‌టించారు. 2008లో జనవరి 10న ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తన కలల కారును ఆవిష్కరించారు. తొలి చూపులోనే ఆ కారు ఆకట్టుకోగలిగింది. అత్యంత చవకైన కారుగా అంతర్జాతీయ స్థాయిలో నానో వార్తల్లో నిలిచింది. 1930ల్లో ఫోక్స్‌వ్యాగన్, 1950ల్లో ఫియట్ కార్ల తరహాలో మార్కెట్లో ఇది అందరి నోళ్లల్లో నానింది. తమ ఇంటికి ఆహ్వానించేందుకు చాలా మంది బుకింగ్‌లు చేసుకున్నారు. కొంత మంది తమ ఇంట్లో కారు ఉన్నప్పటికీ, నానోపై ఇష్టంతో బుక్‌చేసుకున్నారు. 2009లో మార్కెట్లో విడుదల చేశారు. ముందుగా ప్రకటించినట్లే రూ.లక్షకే దాన్ని అందించారు. తొలి బ్యాచ్‌గా తయారైన లక్ష నానో కార్లను లాటరీ పద్ధతిలో అమ్మారు. అప్పటికే కార్ల సరఫరా కంటే డిమాండ్ అధికంగా ఉండటంతో లాటరీ పద్ధతిని ఎంచుకున్నారు. అయితే తయారీ ఖర్చు అధికమైనప్పటికీ.. అన్న మాట ప్రకారం దానిని రూ.లక్షకే అందించారు. రానురాను విడిభాగాల ఖర్చు పెరగడంతో కారు ధరను కూడా కంపెనీ పెంచింది. తదనంతర కాలంలో కారుకు క్రమంగా డిమాండ్‌ తగ్గడంతో ఉత్పత్తిని నిలిపివేశారు. క్రమంగా ఈ చిన్న కారు మార్కెట్లోకి రావడం బందైపోయింది. 2019లో నానో ప్రాజెక్టను కంపెనీ మూసివేసింది. 2022 మే 19న నానో కారులో ముంబైలోని తాజ్‌ హోటల్‌కు వెళ్లారు. ఇది భారతీయులందరికీ అందుబాటులో ఉండే కారు అని, పీపుల్స్‌ కారు అని తరచుగా చెప్పేవారు. కాగా, నానో ప్రయోగం విఫలమైందని ఒక ఇంటర్వ్యూలో ఆయన కూడా అంగీకరించారు.

మాన‌వ‌త్వాన్ని చాటుకుంటూ..
2008 నవంబర్ 26న‌ ముంబైపై ఉగ్రవాదులు దాడి చేశారు. సిటీలోని తాజ్ హోటల్ లో అరాచ‌కం సృష్టించారు. నాడు టాటా గ్రూప్ చైర్మన్ గా ఉన్న రతన్ టాటా వ్యవహరించిన తీరుకు దేశమే స‌లాం కొట్టింది. 60 గంటల పాటు జ‌రిగిన‌ తాజ్ ఆపరేషన్ స‌మ‌యంలో ఆయన ఇంట్లో ఉండలేదు. హోటల్ బయటే భద్రతా దళాలతో కలిసి పని చేశారు. హోటల్ లో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత నాదే అని, వారి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత నాదే అంటూ ప్రకటించారు. ఉగ్రదాడి తర్వాత రతన్ టాటా చేసిన సాయం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ దాడిలో టాటా కంపెనీ ఉద్యోగులతో పాటు ఆ హోటల్ లో బస చేసేందుకు వచ్చిన పర్యాటకులు గాయపడ్డారు. ముంబై ఉగ్రదాడిలో చనిపోయిన మొత్తం 166 మందిలో 33 మంది తాజ్ హోటల్ లోనే చనిపోయారు. ఈ 33 మందిలో 11 మంది హోటల్ ఉద్యోగులున్నారు. ఉగ్రదాడి తర్వాత టాటా హోటల్ క్లోజ్ అవుతుందని చాలా మంది భయపడ్డారు. రతన్ టాటా అలా చేయలేదు. హోటల్ ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు.ఉగ్రదాడిలో మరణించిన తాజ్ ఉద్యోగుల కుటుంబాల‌కు చనిపోయిన ఉద్యోగి తన జీవిత కాలం మొత్తం ఎంత సంపాదిస్తాడో అంత మొత్తాన్ని అందించి వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకున్నారు.ఈ విధంగా 2008లోనే ఒక్కో బాధిత ఉద్యోగి కుటుంబానికి రూ.36 లక్షల‌ నుంచి రూ.85 లక్షల వరకు సాయం చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా తన ఉద్యోగులను ఈ విధంగా ఆదుకున్నది లేదు.

టాటా గ్రూప్స్ కు రాజీనామా…
75 ఏళ్లు నిండిన తర్వాత, రతన్ టాటా 28 డిసెంబర్ 201్2న టాటా గ్రూపులో తన కార్యనిర్వాహక అధికారాలకు రాజీనామా చేశారు. 2016లో సైరస్ మిస్ట్రీని చైర్మన్ పదవి నుంచి తొలగించారు. దీంతో రతన్ టాటా తాత్కాలికంగా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2017 జనవరి 12న నటరాజన్ చంద్రశేఖరన్ టాటా సన్స్ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు. 2017 ఫిబ్రవరిలో ఆయ‌న బాధ్య‌త‌లు స్వీకరించారు.

పెట్టుబ‌డులు…
ర‌త‌న్‌ టాటా తన సొంత సంపదతో పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. భారతదేశంలోని ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో ఒకటైన స్నాప్‌డీల్‌లో పెట్టుబడి పెట్టాడు. జనవరి 2016లో ఆయ‌న‌ ఆన్‌లైన్ ప్రీమియం ఇండియన్ టీ విక్రేత అయిన టీ బాక్స్, క్యాష్ క‌రో డాట్ కామ్‌, డిస్కౌంట్ కూపన్‌లు, క్యాష్-బ్యాక్ వెబ్‌సైట్‌లో పెట్టుబడి పెట్టారు. ఓలా క్యాబ్స్ వంటి వాటిలో చిన్న పెట్టుబడులు పెట్టారు. ఏప్రిల్ 2015లో, చైనీస్ స్మార్ట్‌ఫోన్ స్టార్టప్ షియోమీలో టాటా వాటాను కొనుగోలు చేశారు. 2016లో ఆయ‌న‌ ఆన్‌లైన్ రియల్-ఎస్టేట్ పోర్టల్ అయిన నెస్టావేలో పెట్టుబడి పెట్టారు. తర్వాత ఆన్‌లైన్ రియల్-ఎస్టేట్ , పెట్-కేర్ పోర్టల్ డాగ్‌స్పాట్‌ను ప్రారంభించడానికి జెనీఫైని కొనుగోలు చేశారు. సమాజాభివృద్ధికి విద్య కీలకమని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల స్థాపనలో ఆయన తనవంతు కృషి చేశారు. అనేక స్కాలర్‌షిప్‌లను కూడా ప్రారంభించారు. వాటి ద్వారా లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. టాటా ట్రస్ట్‌లు అనేక ఆరోగ్య సేవలు, ఆసుపత్రులలో పెట్టుబడి పెట్టాయి. క్యాన్సర్ పరిశోధన, ఎయిడ్స్ చికిత్స, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మెరుగుపరచడంలో ఆయన విశేష కృషి చేశారు.

ప్ర‌తిష్టాత్మ‌క అవార్డులు…
ర‌త‌న్ టాటా వ్యాపార రంగంతో పాటు గొప్ప మ‌న‌సుతో ఆయన చేసిన‌ సేవలకు గుర్తింపుగా పలు ప్రతిష్టాత్మక అవార్డులు ద‌క్కించుకున్నారు. 2000 ఏడాదిలో ర‌త‌న్ టాటాకు కేంద్రం ప‌ద్మభూష‌ణ్‌, 2008లో పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఇక రతన్‌ టాటాకు ఇటీవల ప్రతిష్టాత్మక ‘పీవీ నర్సింహారావు స్మారక అవార్డు’ లభించింది. సామాజిక సంక్షేమం, మానవతా దృక్పథంతో అసాధారణ అంకిత భావం ప్రదర్శించిన వారికి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట స్మారక పురస్కారం అందజేస్తారు. ఈ ఏడాది మార్చిలో రతన్ టాటా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దేశ నిర్మాణంలో కీల‌క పాత్ర పోషించిన ర‌త‌న్ టాటా గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. భార‌త్ ఎదుగుద‌ల‌లో ఆయ‌న‌కంటూ కొన్ని ప్ర‌త్యేక పేజీలుంటాయి. కోట్లాది ఆస్తులున్నా ఎలాంటి ఆడంబ‌రాలు లేకుండా మాన‌వ సేవే మాధ‌వ సేవ అంటూ నిత్యం ఎంతో మంది ప్ర‌జ‌ల్ని ఆదుకున్న ఆ త్యాగ‌ధ‌నుడికి ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌ని స్థానం ఉంటుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *