తాజాగా విడుదలైన హర్యానా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మూడో సారి విజయం సాధించింది. అధికారం అందుకోబోతున్నామన్న కాంగ్రెస్ పార్టీకి నిరాశే దక్కింది. సర్వేలన్నీ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తేల్చిచెప్పినా విక్టరీ మాత్రం బీజేపీకే దక్కింది. కౌంటింగ్ మొదట్లో కాంగ్రెస్ జోరు చూపించినా స్లోగా వెనకపడిపోయింది. అయితే ఇక్కడ ఒక విషయం ఆసక్తికరంగా మారింది. అదే ఓట్ షేరింగ్.. ఎన్నికల్లో బీజేపీకి 39.94 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 39.09 శాతం ఓట్లు పడ్డాయి. అంటే రెండు పార్టీల మధ్య అత్యంత స్వల్ప తేడా ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే, రెండు పార్టీలకు అధిక సంఖ్యలోనే ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికలతో పోలిస్తే 11 శాతం ఓట్లు అధికంగా రాగా, బీజేపీకి కేవలం 3 శాతం అధిక ఓట్లు వచ్చాయి. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 36.49 ఓట్ షేర్‌తో 40 సీట్లు దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 28.08 ఓట్ షేర్‌తో 31 సీట్లు గెలిచింది.ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈసారి ఎగ్జిట్ పోల్స్, సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినా ఫలితాలు దానికి భిన్నంగా వచ్చాయి. కాంగ్రెస్ 37 సీట్లు సాధించింది. ఐఎన్ఎల్‌డీ మూడు, ఇండిపెండెంట్లు మరో మూడు సీట్లు గెలుచుకున్నారు. ఇక హర్యానాలో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి 1.79 శాతం ఓట్లు పోలయ్యాయి. హర్యానాలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో 5 సీట్లు గెలుచుకున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 46.11 శాతం, కాంగ్రెస్‌కు 43.67 శాతం ఓట్లు పడ్డాయి. కాగా, 2019లో జరిగిన ఎన్నికల్లో హర్యానాలో పదికి పది సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి సగం సీట్లు కోల్పోయింది.