ఇటీవల పుష్ప విడుదల సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. థియేటర్‌కు హీరో అల్లు అర్జున్ రాకతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందిన ఘటనలో బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఓ రోజు జైలులో సైతం ఉన్నారు. అనంతరం జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో పలువురు బన్నీ ఫ్యాన్స్ పై కేసులు నమోదైనట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారంటూ పలువురు కాంగ్రెస్ నేతలు బన్నీ ఫ్యాన్స్ పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైబర్ క్రైం పోలీసులు నిందితులపై ఐటీ యాక్ట్ తో పాటు బీఎన్ఎస్ 352, 353(1)(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరితో పాటు మరింత మందిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.