టాలీవుడ్ సీనియర్ హీరోల్లో టాప్ హీరో ఎవరంటే ప్రతి ఒక్కరూ చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. అద్భుతమైన నటనతో , మెస్మరైజింగ్ డ్యాన్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు మెగాస్టార్. ఎన్నో అవార్డులు సంపాదించారు. తాజాగా గిన్నిస్ బుక్లో కూడా చోటు దక్కించుకున్నారు. డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. అయితే చిరంజీవి సినిమాల్లోకి రాకముందు నాటక రంగంలో కూడా రాణించారు. నాట్యకారుడిగా ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. శనివారం చిరు సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్టు షేర్ చేశారు. తాను తన బీకాం చదువుతున్న కాలేజీ రోజుల్లో వేసిన నాటకం గురించి ఆయన పోస్టు చేశారు. ‘రాజీనామా’ వైఎన్ఎం కాలేజీ నర్సాపూర్ లో ‘రంగస్థలం’ మీద తొలి నాటకం.. కోన గోవింద రావు గారి రచన; నటుడిగా తొలి గుర్తింపు ..అది ఉత్తమ నటుడు కావటం.. ఎనలేని ప్రోత్సాహం..1974 నుంచి 2024 కి 50 సంవత్సరాలు తన నట ప్రస్థానానికి పూర్తయ్యింది అంటూ చిరు పోస్టు చేశారు. పోస్టులో తన యుక్త వయస్సులో ఉన్న పిక్ పేపర్ కట్ జత చేశారు.ఈ పోస్ట్ చూసి మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సినిమాల్లోకి రాకముందు విషయాన్ని లెక్కలోకి తీసుకుంటే మెగాస్టార్ నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేససుకున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.