హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్కూల్ గేటు విరిగి ఓ బాలుడి పై పడటంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. హయత్‌నగర్‌లోని జడ్పీ హైస్కూల్ వద్ద ఈ ఘటన జరిగింది. అజయ్ అనే బాలుడు జడ్పీ హైస్కూల్ పక్కనే ఉండే ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. సోమవారం అజయ్ స్కూల్‌కు వెళ్లాడు. సాయంత్రం బడిలో కొందరు విద్యార్థులు మెయిన్ గేటు ఎక్కి ఊగుతున్నారు. అజయ్ అక్కడికి వెళ్లి వాళ్లతో ఆడుకున్నాడు. పిల్లలు అందరూ గేటు దిగి వెళ్లిపోగా అజయ్ గేటు ఎక్కి ఊగాడు. అప్పటికే తుప్పుపట్టి ఉన్నగేటు ఒక్కసారిగా విరిగి బాలుడిపై పడింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. గేటు పక్కనే ఉన్న మరో విద్యార్థినికి స్వల్ప గాయమైంది. ఉపాధ్యాయులు బాలుడిని ఆటోలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమించడంతో వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలుడి తల్లిదండ్రులు, బంధువులు మంగళవారం ఉదయం స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.