సికింద్రాబాద్ మొండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముత్యాలమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఇలా హిందూ దేవాలయాలపై దాడులు జరగడం ఇది నాలుగో సంఘటన అని, అయినా పోలీసులు స్పందించడం లేదంటూ సీరియస్ అయ్యారు. హైదరాబాద్లో మతోన్మాద శక్తులు దాడులకు పాల్పడుతూ.. మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మతిస్థిమితం లేని వాళ్లు దాడులు చేస్తున్నారని పోలీసులు చెప్పడం సరికాదన్నారు. నిందితులపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇటీవల ఆలయాలపై జరిగిన దాడులపై దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేసి, ఈ ఘటనల వెనుక ఉన్న వారెవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.