తన కూతురుతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వృద్ధుడిని తండ్రి హతమార్చిన ఘటన ఏపీలో జరిగింది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటకు చెందిన గుట్ట ఆంజనేయులు(59) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఇది హత్యగా నిర్ధారణ అయ్యింది. మంగంపేటకు చెందిన ఆంజనేయ ప్రసాద్ ఈ హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆంజనేయప్రసాద్ భార్యతో కలిసి కువైట్లో ఉంటున్నాడు. తమ కుమార్తె(12)ను ఊర్లో ఉంటున్న తన చెల్లెలు లక్ష్మి, వెంకటరమణ దంపతుల ఇంట్లో ఉంచారు. ఇటీవల వెంకటరమణ తండ్రి ఆంజనేయులు ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తన తల్లి చంద్రకళకు ఈ విషయాన్ని ఫోన్లో తెలియజేసింది. చంద్రకళ ఈ విషయంపై లక్ష్మిని నిలదీసింది. ఆమె నుంచి సరైన స్పందన రాకపోవడంతో చంద్రకళ దంపతులు కువైట్ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆంజనేయులును పిలిపించి మందలించి వదిలేశారు. అయితే తీవ్ర ఆవేదనకు గురైన బాలిక తండ్రి ఆంజనేయ ప్రసాద్ శనివారం ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేసి అదే రోజు కువైట్ వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని వివరిస్తూ యూట్యూబ్లో వీడియో పోస్టు చేశాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. తను చేసిన తప్పును అంగీకరిస్తూ పోలీసులకు లొంగిపోతానని వెల్లడించాడు.