సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ మరణానికి కారణమెవరో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. నేడు మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల సీఎం చంద్రబాబు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పాల్గొనడంపై స్పందించారు. చంద్రబాబు , బాలకృష్ణ ఆ షోలో ఎన్టీఆర్ మరణానికి కారణమైన వాళ్లెవరో కూడా చెప్తే బాగుండేదని అన్నారు. చంద్రబాబు ప్రజలను వంచించి రాజకీయం చేస్తాడని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఇప్పుడు హామీలన్నీ తుంగలో తొక్కి మోసగించారని ఆరోపించారు.
సీఎం చంద్రబాబు రాబోయే ఐదేళ్లు కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి ఇప్పుడు అడ్డగోలుగా మాట తప్పి వేల కోట్ల భారం జనం మీద వేయబోతున్నారన్నారు. రూ.6,072 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు నిత్యవసర ధరల పెరుగుదల, డెంగ్యూ, డయేరియా వంటి సమస్యలతో సతమతమవుతుంటే చంద్రబాబు టీవీ షోలతో పబ్బం గడపడం సిగ్గు చేటన్నారు.