ఏపీ మంత్రి నారా లోకేశ్ రెడ్‌బుక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు నారా లోకేశ్ ప్రకటించిన రెడ్ బుక్ ఏపీలో ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందంటూ విరుచుకుపడుతున్నారు. అక్రమంగా వైసీపీ నేతలను అరెస్టు చేస్తూ నారా లోకేశ్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలో అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేశ్ మరోసారి రెడ్ బుక్‌పై స్పందించారు. రెడ్ బుక్‌లో రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయని, త్వరలో మూడో చాప్టర్ తెరుస్తామని చెప్పారు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటనలో ఉన్న లోకేశ్ అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. యువగళం పాదయాత్రలో తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని స్పష్టం చేశారు. జగన్ రెడ్‌బుక్‌కు భయపడి గుడ్‌బుక్ తీసుకొస్తానని అంటున్నారని, ఆ బుక్‌లో ఏం రాయాలో కూడా ఆయనకు అర్థం కావడం లేదని చెప్పారు. నారా లోకేశ్ ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే పలువురు ప్రముఖులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో మూడో విడతలో ఎవరిని అరెస్ట్ చేస్తారోనని అందరూ చర్చించుకుంటున్నారు.